HeadLines

'గుంటూరోడు' రివ్యూ


మంచు మనోజ్ హీరోగా 'నా రాకుమారుడు’ ఫేం ఎస్కే సత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'గుంటూరోడు'. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పడం విశేషం. టైటిల్ మొదలు ట్రైలర్స్ వరకూ పక్కా మాస్ ఎంటర్ టైనర్ మార్క్ తో ఊరించిన ఈ మూవీ.. ఈ శుక్రవారం (03-03-17) విడుదలైంది. మనోజ్ ఆశిస్తున్న కమర్షియల్ సక్సెస్ ను ఈ సినిమా అందిస్తుందో లేదో ఇప్పుడు చూద్దాం..!

కథ:
ఫ్రెండ్స్ తో ఆవారాగా తిరుగుతున్న కొడుకు కన్నా (మనోజ్)కు పెళ్లి చేయాలనుకుంటాడు సూర్య నారాయణ (రాజేంద్ర ప్రసాద్). అయితే... పెళ్లిచూపుల్లో పెళ్లికూతురి ఫ్రెండ్ అమృత (ప్రగ్యా జైస్వాల్) నచ్చడంతో ఆ పెళ్లికి నో చెప్పి.. అమృతను ఇంప్రెస్ చేసే పనిలో పడతాడు కన్నా. అసలే చేతిదూల ఎక్కువైన కన్నా.. ఓ బర్త్ డే పార్టీ వివాదంలో గుంటూరుకు ఫేమస్ క్రిమినల్ లాయర్ అయిన శేషు (సంపత్ రాజ్)ను కొడతాడు. కాకపోతే ఈ ఇద్దరికీ కూడా ఒకరికి మరొకరు తెలియరు. అప్పటినుంచి కన్నాను చంపేందుకు వెతుకుతుంటాడు శేషు. ఈ విలన్ చెల్లెలే అమృత అని ఆలస్యంగా తెలుస్తుంది కన్నాకు. ఈలోపు తప్పుడు కేసులు బనాయించి కన్నాను జైలు పాలు చేస్తాడు శేషు. ఎమ్మెల్యే సీటు కోసం ట్రై చేస్తున్న శేషుకు అది దక్కకుండా చేసి రివర్స్ ఎటాక్ ఇస్తాడు కన్నా. ఈలోపు వీరి ప్రేమ విషయం తెలిసి.. అమృతకు సీక్రెట్ గా మరో పెళ్లి చేయాలనుకుంటాడు శేషు. ఆ మ్యారేజ్ ను కన్నా ఎలా అడ్డుకున్నాడు.. వీరి వివాహం ఎలా జరిగింది అనేది క్లైమాక్స్.


విశ్లేషణ:
సామాన్యుడైన హీరో ఓ అనుకోని సందర్భంలో బలవంతుడైన విలన్ తో గొడవ పడటం.. ఆ తర్వాత విలన్ గ్యాంగ్ హీరో కోసం వెతుకులాడటం.. ఇంటర్వల్ టైమ్ కు హీరోను కనుక్కోవడం.. క్లైమాక్స్ కు హీరో విలన్ పై విజయం సాధించడం.. మన సినిమాల్లో ఎప్పటినుంచో చూస్తున్న రెగ్యులర్ కమర్షియల్ పాయింట్ ఇది. అయితే.. హీరో విలన్ నడుమ సాగే టామ్ అండ్ జెర్రీ ఆటను.. ఎత్తుకు పైఎత్తులతో రసవత్తరంగా చూపించగలగితే.. ఈ రొటీన్ ఫార్ములా కూడా ఎన్నోసార్లు విజయాలను అందించింది. కానీ.. దర్శకుడు సత్య ఈ విషయంలో మాస్ ఆడియన్స్ ఆశించే యాక్షన్ సీన్స్ అయితే ప్లాన్ చేసుకున్నాడు కానీ... మిగతా విషయాలను వదిలేశాడు. 'లవ్ లో పడ్డాడు' అనే టైటిల్ ట్యాగ్ లైన్ కు తగ్గ లవ్ స్టోరీ లేకపోవడం మరో మైనస్. ఇక కామెడీ విషయంలోనూ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

దర్శకుడు మనోజ్ ను మాస్ హీరోగా చూపించాలనే విషయంపైనే ఎక్కువ దృష్టి సారించాడు. ఇందుకోసమే అన్నట్టు హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్, మాస్ సాంగ్స్ వంటి కమర్షియల్ హంగులద్దాడు. కాకపోతే మనోజ్ కు ఇవన్నీ కొత్త కాదు. గతంలోనూ ఇలాంటి విన్యాసాలేన్నో చేసేసి మనోజ్.. ఈ మూవీ యాక్షన్ సీన్స్ విషయంలో కాస్త ఇంటెన్సిటీ పెంచాడంతే. విలన్ ఇంట్రడక్షన్ ను ఎంతో ఆసక్తికరంగా చూపించిన దర్శకుడు.. హీరో-విలన్ నడుమ సాగే హోరాహోరీ పోరాటాన్ని సరిగా ఎస్టాబ్లిస్ చేయలేదు. దీంతో ఫస్ట్ లవ్ స్టోరీతో బోర్ కొట్టించగా సెకండాఫ్ ఎలాంటి ఎక్సైట్ మెంట్ లేకుండా చప్పగా సాగింది. ఫస్టాఫ్ చివరలో వచ్చే యాక్షన్ సీన్స్ తో పాటు తండ్రి-కొడుకు సెంటిమెంట్ సీన్స్ తో సినిమాను కాస్త గాడిలో పడేసే ప్రయత్నమే చేసినా.. ద్వితియార్థానికి అది నీరసపడింది. ఇక క్లైమాక్స్ మరంతగా నిరాశపరచింది.



నటీనటులు:
మనోజ్ కు ఈ తరహా పాత్రలు కొట్టిన పిండి. ఫైట్స్ లో మరోసారి రెచ్చిపోయాడు. ఇక తండ్రి మోహన్ బాబు తరహాలో సాగే డైలాగ్ మాడ్యులేషన్ అభిమానులను ఆకట్టుకుంటుంది. కాకపోతే.. అతిగా పెరిగిన మనోజ్ శరీరం ఇబ్బందిపెడుతుంది. దీంతో అసలే స్లిమ్ గా ఉండే ప్రగ్యా జైస్వాల్ తో ఆన్ స్క్రీన్ కెమెస్ట్రీ వర్కవుట్ అవలేదు. ప్రగ్యాకు 'కంచె' తరహాలో పెర్పామెన్స్ చూపించే పాత్రేమీ ఈ సినిమాలో లభించలేదు. రాజేంద్ర ప్రసాద్ సెంటిమెంట్ పండించగా, సంపత్ రాజ్, కోట శ్రీనివాసరావు తమదైన శైలిలో విలన్స్ గా మెప్పించారు. రావు రమేశ్ క్లైమాక్స్ లో మెరిశాడు. ప్రవీన్, సత్య హీరో ఫ్రెండ్స్ గా నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ అది ప్రయత్నానికే పరిమితమైంది.

సాంకేతికంగా..
కమర్షియల్ సినిమాకు సగం సక్సెస్ ఆడియోతోనే వచ్చేస్తుంది. ఈ విషయంలో డీజే వసంత్ పర్వాలేదనిపించాడే తప్ప.. పవర్ చూపించలేదు. చిన్నా నేపథ్య సంగీతం రొటీన్ గా ఉండటం అటుంచి.. అక్కడక్కడా 'సరైనోడు' ఆర్ ఆర్ వినిపించింది. సిద్దార్థ్ రామస్వామి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. రచయితగానూ వ్యవహరించిన దర్శకుడు సత్య.. కథనం విషయంలోనే కాదు డైలాగ్స్ విషయంలోనూ కొత్తదనమేమి చూపించలేదు.

ఫైనల్ గా..
మాస్ ఆడియన్స్ ను మాత్రమే అలరించడానికి అనే తరహాలో తెరకెక్కించిన 'గుంటూరోడు'.. ఏమాత్రం కొత్తదనం లేని కథ, కథనాలతో సాగింది. ఎన్నో కమర్షియల్ సినిమాలకు పరాజయం చవిచూపిస్తూ.. తమ అభిరుచి మారిందని ప్రేక్షకులు నిరూపిస్తున్నా.. ఒకటి, అరా విజయాలను బూతద్దంలో చూసి ఈ తరహా రెగ్యులర్ స్టోరీలు ఇంకా తెలుగులో వస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. మరి.. ఆ ఒకటి అరా విజయాల్లో ఈ సినిమాను కూడా చేర్చుతారో లేదో ప్రేక్షకులే తేల్చాలి..!

Rating: 2/5