HeadLines

సినిమా రివ్యూ: ఫిదా


ఫీల్ గుడ్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ అయిన శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన చిత్రం ‘ఫిదా’. వరుణ్‌ తేజ్, సాయిపల్లవి జంటగా దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (21-07-2017)విడుదలైంది.  మరి.. ఈ సినిమా ప్రేక్షకులను నొప్పించిందో, మెప్పించిందో సమీక్షలో చూద్దాం..

కథ:
అమెరికాలో మెడిసన్ చదివే కుర్రాడు వరుణ్ (వరుణ్ తేజ్). తన అన్న (రాజా) పెళ్లిచూపుల కోసం తెలంగాణలోని బాన్సువాడకు వస్తాడు. అమ్మాయి నచ్చడంతో పెళ్లి కుదురుతుంది. చాలా ప్రేమకథలు పెళ్లిపందిళ్లలోనే పురుడు పోసుకున్నట్టు వరుణ్ కూడా.. తనకు కాబోయే వదిన చెల్లెలైన భానుమతితో ప్రేమలో పడతాడు. భానుకు కూడా వరుణ్ నచ్చుతాడు కానీ.. ఆ విషయం చెప్పేలోపే అతడికి మరొకరిపై ఆసక్తి ఉందేమో అని పొరపడి వెనక్కు తగ్గుతుంది. అమెరికా వెళ్లిన వరుణ్.. తన ప్రేమను ప్రకటిస్తూ మెసేస్ చేస్తే కూడా రిజక్ట్ చేస్తుంది. పైగా మరొకరితో పెళ్లికి ఓకే చెపుతుంది. ఈ క్రమంలో వీరిద్దరి ప్రేమకథ ఎలా సుఖాంతం అయింది అనేది ఈ సినిమా కథ.


నటీనటుల ప్రతిభ:
ఫస్ట్ మూవీ 'ప్రేమమ్'తోనే మలయాళ కుర్రకారును ప్రేమలో పడేసిన సాయిపల్లవి... తెలుగులోనూ తొలిచిత్రంతోనే 'ఫిదా' చేసేసింది. ప్రారంభంలో బుగ్గల నిండా మొటిమలతో ఇదెక్కడి హీరోయిన్ రా అనుకున్న ప్రేక్షకులే.. ఫస్ట్ సాంగ్ వచ్చే సమయానికి సాయిపల్లవితో ప్రేమలో పడతారు. తన నటనతో అంతలా ఆకట్టుకుంది. ఓ మలయాళీ అమ్మాయి తెలుగులో డైలాగ్స్ చెప్పడం.. పైగా తెలంగాణ యాసతో మెప్పించడం మామూలు విషయమేమి కాదు. చలాకీ అమ్మాయిగా ఆకట్టుకోవడమే కాక సెంటిమెంట్ సీన్స్ లోనూ సత్తా చాటింది సాయిపల్లవి.

వరుణ్ తేజ్ కూడా.. పాత్రకు తగ్గ రీతిలో ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్ లో మెప్పించి.. శేఖర్ కమ్ముల సినిమాకు పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించుకున్నాడు. హీరోకు అన్న పాత్రలో రాజా (గీతరచయిత సీతారామశాస్త్రి గారి అబ్బాయి) ఆకట్టుకున్నాడు. చాన్నాళ్ల తర్వాత మళ్లీ కనిపించిన నిన్నటితరం నటుడు సాయిచంద్ హీరోయిన్ కు తండ్రిగా మెప్పించాడు. అత్తగా నటించిన గీతా భాస్కర్ ('పెళ్లిచూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ తల్లి).. అక్కగా నటించిన అమ్మాయి.. సత్యం రాజేష్, హర్షవర్థన్ రాణే పాత్రల పరిధిమేరకు నటించారు.

సాంకేతికంగా...
వంశీ సినిమాల విషయంలో... సాంకేతిక నిపుణులు ఎవరు వర్క్ చేసినా... ఓ పాట చూడగానే ఇది వంశీ సినిమా అని చెప్పేస్తాం. శేఖర్ కమ్ముల కూడా అంతే. ఎలాంటి టెక్నీషియన్స్ ను అయినా తన శైలికి తగ్గ రీతిలో పనిచేయించుకుంటాడు. 'ఫిదా' విషయంలోనూ ఇదే జరిగింది. గతంలో 'సత్య-2', 'కో అంటే కోటి' వంటి చిత్రాలకు సంగీతం ఇచ్చిన శక్తికాంత్.. శేఖర్ టేస్ట్ కు తగ్గ సంగీతాన్ని అందించాడు. 'వచ్చిండే'.. 'హేయ్ పిల్లగాడ' సాంగ్స్ తో పాటు నేపథ్య సంగీతం బాగుంది. సినిమాలోని ప్రతీ సీన్ లో విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. పల్లెటూరు అనగానే కోనసీమను మాత్రమే చూపించే తెలుగు చిత్రసీమకు... తెలంగాణలోని పల్లెటూర్లను కూడా ఇంత అందంగా చూపించొచ్చు అని చెప్పడం మెచ్చకోదగ్గ అంశం. శేఖర్ కమ్ముల అందించిన సంభాషణలు మెప్పించాయి. ముఖ్యంగా తెలంగాణ యాసతో మెప్పించగలిగాడు. నిర్మాణ విలువలు విషయంలో దిల్ రాజు ఏమాత్రం రాజీపడలేదు.

సమీక్ష..
కథ విషయంలో రొటీన్ కథనే ఎంచుకున్న శేఖర్ కమ్ముల.. కథనంలోనూ కొత్త మలుపులేమి తిప్పలేదు. కానీ.. ప్రతీ సన్నివేశాన్ని ఆకట్టుకునేలా చిత్రీకరించాడు. మన ఇంటి పక్కనే ఈ సీన్ జరుగుతోంది అని ప్రేక్షకుడు భావించి.. కథలో మమేకమయ్యేలా చేశాడు. కృత్రిమత్వంతో కూడిన డ్రామా సీన్స్ ఎక్కడా లేవు. సహజంగా సాగే సంభాషణలు సినిమాకు ప్లస్ పాయింట్. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ తరహాలో మరోసారి 'ఫిదా'లోనూ తన మార్క్ చూపించిన శేఖర్ కమ్ముల.. ఈ సినిమాతో తిరిగి తనను తాను ఆవిష్కరించుకున్నాడని చెప్పొచ్చు.

అయితే ఆడియన్స్ ను పూర్తి స్థాయిలో ఆసక్తి రేకెత్తించిలా మాత్రం ఈ సినిమా లేదు. ప్రేక్షకులు ఊహించని మలుపులేవీ ఈ సినిమాలో కనిపించవు. ముఖ్యంగా సెకండాఫ్ విషయంలో కథ నెమ్మదించింది. సీన్లు భారంగా సాగిన అనుభూతి కలుగుతుంది. ప్రేమికుల మధ్య దూరం పెరగడానికి చూపించిన కారణం కూడా సహేతుకంగా లేదు. కానీ.. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ముడిపడ్డ ప్రేమకథ ముందు ఇవన్నీ చాలా చిన్నవనిపిస్తాయి. ప్రేక్షకులు ముందే ఊహించిన క్లైమాక్స్ అయినప్పటికీ.. అప్పటికే శేఖర్ మార్క్ మత్తులో.. సాయిపల్లవి గమ్మత్తులో పడ్డ ఆడియన్స్ కుర్చీల నుంచి లేవరు.

తన తొలిచిత్రం నుంచి హీరోయిన్ క్యారెక్టర్స్ ను బలంగా చూపించిన శేఖర్.. 'ఫిదా' సినిమాలోనూ 'భానుమతి' పాత్రను బలంగా తీర్చిదిద్దాడు. అలాగని హీరో క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ లేదని కాదు గానీ.. వరుణ్ ను భానుమితి డామినేట్ చేసేసిందంతే. ఇక తెలంగాణ యాసను ఇప్పటివరకూ ఎక్కువగా విలన్స్ కే ఎక్కువగా వాడగా.. ఇటీవల 'పెళ్లిచూపులు', 'అమీ-తుమీ' వంటి సినిమాల్లో కామెడీకి వాడారు. కానీ.. ఈ సినిమాలో పూర్తి స్థాయి తెలంగాణ యాసతో హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేశాడు శేఖర్ కమ్ముల. సినిమాకు ఇదో స్పెషల్ అట్రాక్షన్ గా నిలచింది.


ఫైనల్ గా... 'ఫిదా' చేసేసింది.
3/5