ట్రైలర్ టాక్: నాగార్జున 'రాజు గారి గది-2'
నాగార్జున కథానాయకుడిగా రూపొందిన ''రాజు గారి గది 2'' ట్రైలర్ విడుదలైంది. గతంలో ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన 'రాజు గారి గది'కి ఇది సీక్వెల్. సమంత కీలకపాత్ర పోషించిన ఈ సినిమాలో సీరత్ కపూర్, అశ్విన్, వెన్నెల కిశోర్, ప్రవీణ్, షకలక శంకర్ ఇతర పాత్రలు పోషించారు. అక్కినేని జయంతి సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
'ఆత్మను శస్త్రము ఛేదింపజాలదు, అగ్ని దహింపజాలదు... ఆత్మ నాశనము లేనిది' అంటూ భగవద్గీతలోని శ్లోకంతో మొదలైన ట్రైలర్.. చివరకు ఊరమాస్ దెయ్యంతో హడలెత్తించింది. కళ్లల్లోకి చూస్తూ గుండెల్లో ఏమున్నదో చెప్పే మెంటలిస్టుగా నాగార్జున ఈ చిత్రంలో నటించగా.. ఆత్మగా సమంత కనిపించారు. ఇక బికినీలో సీరత్ కపూర్ అందాల ప్రదర్శనతో ఆకట్టుకోగా.. ఎప్పటిలాగే దెయ్యాన్ని చూసే భయపడే కమెడియన్స్ గా వెన్నెల కిషోర్ బ్యాచ్ నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు.
ట్రైలర్ రెగ్యులర్ హారర్ కామెడీ సినిమాలాగే ఉన్నప్పటికీ.. తమన్ నేపథ్య సంగీతం మాత్రం ట్రైలర్ ను ఓ రేంజ్ లో నిలబెట్టింది. చేతిలో రుద్రాక్ష మాలతో 'రాజు గారి గది'లోకి నాగార్జున ఎంట్రీ.. ఊరమాస్ దెయ్యమంటూ వెన్నెల కిషోర్ హడలిపోవడం.. గోడలో నుంచి వచ్చిన దెయ్యం చెయ్యి షకలక శంకర్ మెడ పట్టుకోవడం.. ఆత్మ ఆకారాన్ని సమంతగా నాగార్జున పెయింటింగ్ వేస్తే అది దానంతట అదే మాయం కావడం వంటి అంశాలు ఈ ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి. అక్టోబర్-13న విడుదల కాబోతున్న ఈ మూవీ.. 'రాజు గారి గది' మేజిక్ రిపీట్ చేస్తుందేమో చూద్దాం...