HeadLines

'చి.ల.సౌ' రివ్యూ.. మరో 'పెళ్లిచూపులు' ప్రేమకథ

డైరెక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయ్యామని చాలామంది చెపుతారు. కానీ.. నటుడయ్యాక సిన్సియర్ గా డైరెక్షన్ వైపుకు మళ్లేవారు ఈమధ్య కాలంలో తగ్గారనే చెప్పాలి. 'అందాల రాక్షసి'తో హీరోగా పరిచయమై.. లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ మాత్రం 'చి.ల.సౌ' చిత్రంతో సిన్సియర్ అటెమ్ట్ చేశానంటున్నాడు. సుశాంత్, రుహానీ శర్మ జంటగా నటించిన ఈ సినిమా ఆగస్టు-3న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి రాహుల్ దర్శకుడిగా తన మార్క్ చూపించాడో లేదో చూద్దాం..!

కథ:

పెళ్లి అంటేనే ఆమడదూరం పారిపోయే కుర్రాడు అర్జున్ (సుశాంత్). మరొకరిపై ఆధారపడి బ్రతక కూడదనుకునే ఆత్మగౌరవం మెండుగా ఉన్న అమ్మాయి అంజలి(రుహానీ శర్మ). పెళ్లంటే బొత్తిగా ఇష్టంలేని అర్జున్.. తల్లి పోరు పడలేక ఓ పెళ్లిచూపులుకు ఓకే చెపుతాడు. మరోవైపు తల్లి ఆరోగ్య సమస్యల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లిచూపులకు ఒప్పుకుంటుంది అంజలి. రొటీన్ ఫార్మట్ కు భిన్నంగా ప్రయత్నించిన ఆ పెళ్లిచూపులు అనుకోని మలుపులు తిరిగి.. ఆ ఇద్దరినీ ఎలా ఒక్కటి చేసింది అనేదే ఈ సినిమా కథ.

అభినయపర్వం..
కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తోన్న సుశాంత్.. ఈ సినిమాకు అంగీకరించడంలోనే సగం సక్సెస్ అయ్యాడు. మునుపటితో పోల్చితే నటనలోనూ ఇంప్రూవ్ మెంట్ చూపించాడు. సుశాంత్ కెరీర్ లో ఇదే సెటిల్డ్ ప‌ర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ట్రైలర్ చూస్తే హీరోయిన్ మైనస్ ఏమో అనుకుంటారు కానీ.. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ లో రుహానీ శర్మ నటన కూడా ఒకటి. వెన్నెల కిషోర్ కామెడీని ఫుల్ గా వాడేసుకున్నాడు రాహుల్. విద్యుల్లేఖ వంటి లేడీ కమెడియన్ కు సిస్టర్ రోల్ కు పరిమితం చేయడంతో ఆమె నుంచి ఎక్కువ కామెడీ ఆశించలేం. 'బాహుబలి'లో మదర్ గా కనిపించిన రోహినికి ఈ సినిమాలో టీవీ సీరియల్ కష్టాలు ఇచ్చినట్టయింది. కానీ నటన పరంగా మెప్పించింది. సుశాంత్ కు తల్లిగా అను హాసన్ ఆకట్టుకుంది. పోలీస్ ఆఫీసర్ గా రాహుల్ రామకృష్ణ ఇంప్రస్ చేశాడు.

సాంకేతికవర్గం

ప్రశాంత్ ఆర్ విహారీ నేపధ్య సంగీతం, సుకుమార్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి. కథకు అడ్డుపడేలా అనవసరమైన డ్యుయెట్స్ లేకపోవడం కలిసొచ్చే అంశం. సందర్భానుసారంగా వచ్చే పాటలు పర్వాలేదనిపించాయి. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ బాగుంది.
దర్శకుడిగానే కాక రచయితగానూ తన మార్క్ చూపించాడు రాహుల్ రవీంద్రన్. నిజానికి ఈ కథను రాహుల్ తానే హీరోగా రూపొందించి ఉండొచ్చు. కానీ పూర్తి స్థాయిలో దర్శకత్వం పైనే దృష్టి పెట్టాడు. ఏదో దర్శకుడు అనిపించుకోవాలి అనే మోజుతో కాకుండా..  దర్శకుడిగా మెప్పించాలనే తపన, పట్టుదలతో ఈ సినిమా రూపొందించాడని స్పష్టమవుతోంది. పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాకే సెట్స్ కు వచ్చినట్టు ఈజీగా అర్థమవుతోంది.

సమీక్ష :
పెళ్లిచూపులు అనే సింగిల్ మీటింగ్ లోనే ఇద్దరిలోనూ ఒకరిపై మరొకరికి ప్రేమ కలిగిందనే విషయాన్ని చెపుతూనే.. ఆ ప్రేమలోని నిజాయితిని ఆరోజు రాత్రి జరిగిన సంఘటనలతో నిరూపించి కథను సుఖాంతం చేశాడు దర్శకుడు రాహుల్. ఫస్ట్ హాప్ లో ఇంట్రస్ట్రింగ్ పాయింట్ తోనే కథను ఎత్తుకున్నప్పటికీ.. హీరోయిన్ ఇంటి సమస్యలతో ఎమోషనల్ టర్న్ తీసుకుని కాస్త నెమ్మదించింది. ప్లాష్ బ్యాక్ సీన్స్ తర్వాత మళ్లీ ఊపందుకుంది. సెకండాఫ్ కూడా స్టోనీ మొదలైనప్పటికీ అనుకోని మలుపులతో కథ గాడిన పడి ఆకట్టుకునేలా సాగింది. పెద్దగా ట్విస్టులు లేని కామన్ ఆడియన్ కూడా ముందే ఊహించేయగల కథ కావడం సినిమాకు కొంత మైనస్. కానీ బోర్ కొట్టించకుండా కథను నడిపించడంలో రాహుల్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. మొత్తానికి రెగ్యులర్ కమర్షియల్ మీటర్స్ కు భిన్నంగా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని అందించాడు రాహుల్ రవీంద్రన్. 'పెళ్లిచూపులు' వంటి సినిమాలు నచ్చేవారికి.. ఇదే తరహాలో వచ్చిన 'చిలసౌ' కూడా నచ్చుతుంది.

టైటిల్ జస్టిఫికేషన్
పెళ్లిని ఏవగించుకునే కుర్రాడి కథ అని ట్రైలర్ లో హైలెట్ చేశారు కానీ.. నిజానికి ఇది వేరే కథ. ఈ సినిమాకు 'పెళ్లిచూపులు' అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అందుకే 'చిరంజీవి అర్జున్' అనే మరో టైటిల్ నిర్ణయించారట. కానీ 'అర్జున్ రెడ్డి' ఎఫెక్ట్ అనుకుంటారని.. వెన్నెల కిషోర్ సూచించిన 'చిలసౌ' టైటిల్ ఫిక్స్ అయ్యారు. పెళ్లి చుట్టూ తిరిగే ప్రేమకథ కావడం.. హీరోయిన్ కు ఇంపార్టెన్స్ ఉన్న సినిమా కావడంతో టైటిల్ 'చిలసౌ'తో టైటిల్ జస్టిఫికేషన్ లభించినట్టే..!

రేటింగ్.. 2.75/5
ఫీల్ గుడ్ పెళ్లికథ
***********************
Movie: ChiLaSow 
Cast: Sushanth, RuhaniSharma, Vennela Kishore, 
          Rahul Ramakrishnan, AnuHassan and Rohini 
Director: Rahul Ravindran
Banner: Siruni Cine Corporation and Annapurna Studios 
Producer: Jaswanth Nadipalli and Nagarjuna Akkineni 

Music: Prashanth R Vihari 
Cinematography - M. Sukumar
Editor- Chota K Prasad 
Release Date: 03-08-2018
************************

Tags: ChiLaSow Review, Sushanth, RuhaniSharma, Rahul Ravindran, Nagarjun, ChiLaSow Movie Review