HeadLines

స‌వ్య‌సాచి రివ్యూ

 
 
ఫస్ట్‌మూవీతోనే తన మార్క్ చూపించిన చందు మొండేటి సెకండ్‌ సినిమాకే రీమేక్‌(ప్రేమమ్‌)ను ఎంచుకోవడంతో ట్రాక్‌ మార్చాడనుకున్నారంతా. కానీ ‘సవ్యసాచి’ లాంటి టైటిల్‌తో ‘వ్యానిషింగ్‌ ట్విన్ సిండ్రోమ్‌’ అనే అరుదైన విషయాన్ని చెప్పబోతున్నాడు అనడంతో ‘కార్తికేయ’ లాంటి మరో వైవిధ్యభరిత చిత్రం వస్తుందని ఆశించారంతా. మూడు వరుస విజయాలు అందుకున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడంతో అంచనాలూ పెరిగాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అధిగమించిందో చూద్దాం. 
 
కథ
వ్యానిషింగ్‌ ట్విన్ సిండ్రోమ్‌తో ఒకే శరీరంలో కలిసున్న ట్విన్స్ కథ ‘సవ్యసాచి’. టెక్నికల్‌గా ట్విన్స్ అయినా విజువల్‌గా కనిపించేది విక్రమ్‌ ఒక్కడే. తన ఆనందాన్ని, ఆవేశాన్ని విక్రమ్‌ ఎడమచేతి రూపంలో చూపిస్తాడు లోపలున్న ఆదిత్య. ఇదిలా ఉంటే ఓసారి హిమాచల్‌ప్రదేశ్‌ టూరుకు వెళ్తాడు విక్రమ్‌. ఒకరికొకరు తెలియని ఆ బస్సులోని 21మందికి ఓ వ్యక్తితో మాత్రం కామన్‌ లింక్‌ ఉంటుంది. మాటల మధ్యలో ఆ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయేలోపు బస్సు ప్రమాదానికి గురై లోయలో పడుతుంది. ఇరవై మంది చనిపోగా విక్రమ్‌ మాత్రం బయటపడతాడు. 
ప్రమాదం నుంచి బయటపడి ఇంటికి వచ్చిన విక్రమ్‌ తన అక్క, బావ (భూమిక, భరత్‌రెడ్డి)తో ఎప్పటిలా తన జీవితం కొనసాగిస్తుంటాడు. మేనకోడలు మహాలక్ష్మి అంటే విక్రమ్‌కు ప్రాణం. ఒకప్పుడు కాలేజీలో తాను ప్రేమించిన చిత్ర కూడా తిరిగి అతని జీవితంలోకి వస్తుంది. సాఫీగా సాగిపోతున్న విక్రమ్‌ ప్రశాంత జీవితంలోకి తుపానులా ఓ అజ్ఞాతవ్యక్తి (మాధవన్‌) ప్రవేశిస్తాడు. ఓ ప్రాజెక్ట్ పనిపై న్యూయార్క్ వెళ్లిన విక్రమ్ తిరిగొచ్చేసరికి గ్యాస్ సిలిండర్ పేలి బావ, మేనకోడలు చనిపోయారని, అక్క ఆస్పత్రిలో ఉందని తెలుస్తుంది. అయితే మేనకోడలు చనిపోలేదు అజ్ఞాతవ్యక్తి కిడ్నాప్‌ చేశాడని తెలుసుకుంటాడు. ఎక్కడ ఉంటాడో, ఎలా ఉంటాడో తెలియని కిడ్నాపర్‌ పాపను అడ్డుపెట్టుకుని విక్రమ్‌తో మైండ్ గేమ్ ఆడతాడు. అసలెందుకు అతను పాపను కిడ్నాప్‌ చేశాడు. బస్సు యాక్సిడెంట్‌కు కూడా అతనే కారణమా..? విక్రమ్‌తో అతనికి ఉన్న పగ ఏంటి..? ఎలా పజిల్‌ను సాల్వ్ చేశాడు, ఇందుకు ఎడమ చేయి (ఆదిత్య) ఎంతవరకూ హెల్ప్ అయిందనేది మిగతా కథ. 

ఎవరెలా..?
వైవిధ్యమైన ఈ కథను అంగీకరించడమే కాక పాత్రకు తగ్గట్టుగా మెప్పించాడు నాగచైతన్య. నిధి అగర్వాల్‌ అందంతో ఆకట్టుకున్నా పెర్ఫామెన్స్‌కు తగ్గ పాత్ర లభించలేదు. వైవిధ్యమైన పాత్రలతో వర్సటైల్‌ యాక్టర్‌గా వావ్ అనిపిస్తోన్న మాధవన్ ఈ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించాడు. సైకో విలన్‌గా మాధవన్‌ ఇంప్రస్ చేశాడు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అక్క, వదిన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన భూమికకు ఇలాంటి పాత్రలు కొత్తేమి కావు. వెన్నెల కిషోర్‌, సత్య, సుదర్శన్‌, విద్యుల్లేఖ, షకలక శంకర్‌ కామెడీ ట్రాక్స్ నవ్వించగా సుభద్రకళ్యాణం స్కిట్‌ విసిగించింది. టైటిల్‌ కార్డ్ చూస్తే తప్ప ఈ సినిమాకు పాటలు (లగాయతు రీమిక్స్‌తో సహా) కీరవాణి అని నమ్మలేం. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఆ వెలితి భర్తీ చేశాడు. చందు మొండేటి డైలాగ్స్ అక్కడక్కడా ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌ వర్క్ బాగుంది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు. 

సమీక్ష
కథ మొత్తం సెకండాఫ్‌కే పరిమితం అవడం, ట్విస్టులన్నీ సెకండాఫ్‌ కోసం దాచుకోవడంతో ఫస్ట్‌హాఫ్‌లో కథ కరువైంది. అది భర్తీ చేయడానికి ఎంచుకున్న  లవ్‌ ట్రాక్‌ ఆసక్తికరంగా సాగలేదు. ఎంటర్‌టైన్మెంట్‌ ఉన్నప్పటికీ కథ అంటూ కొరవడడంతో ఏవో సీన్స్ వచ్చిపోతున్నాయనే ఫీలింగ్. కనీసం విలన్‌ ఎంట్రీనయినా కాస్త ముందుకు జరిపితే సినిమాలో స్పీడు పెరిగేది. మైండ్‌ గేమ్‌ ఆడే విలన్‌కు హీరోకు ఇలాంటి సమస్య ఉందని తెలియకపోవడం, తెలిసిన తర్వాత కూడా ఆవైపు ఎలాంటి చర్యలు లేకపోవడం ఆశ్చర్యకరం. విలన్‌ అంత సైకోగా మారడానికి బలమైన కారణాలూ కనిపించవు. 
‘వ్యానిషింగ్‌ ట్విన్‌ సిండ్రోమ్‌’ అనేది ఈ సినిమా విషయంలో ఆసక్తికర అంశం. ప్రేక్షకులను థియేటర్స్ వైపు నడిపించేది కూడా అదే. కథకు మెయిన్‌ థీమ్‌ కావాల్సిన ఈ పాయింట్‌ను సబ్‌ ట్రాక్‌ చేసేశాడు దర్శకుడు. దీంతో ఈ సిండ్రోమ్‌ అనేది కథలో భాగమే తప్ప అదే కథ కాకుండా పోయింది. తాను అనుకున్న కథలోకి ఈ సిండ్రోమ్‌ను బ్లెండ్‌ చేశానని పలుమార్లు చెప్పిన దర్శకుడు.. రెండింటినీ మాత్రం బ్యాలెన్స్ చేయలేకపోయాడు. ‘వ్యానిషింగ్‌ ట్విన్‌ సిండ్రోమ్‌’ను జస్ట్ హీరోకున్న ఓ స్వభావంలా మాత్రమే చూపించాడు. దీంతో సైకో మైండ్‌ గేమ్‌ చాటున నడిపించిన రొటీన్‌ రివేంజ్‌ డ్రామాలా తయారైంది.  క్లైమాక్స్ కు వచ్చేసరికి ఆ సిండ్రోమ్‌ లేకుండా కూడా  ఈ కథ చెప్పొచ్చుగా అన్నట్టుగా తయారైంది. ఫైనల్‌గా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ను రొటీన్‌గా తీసినట్టయింది. 
అరుదైన సిండ్రోమ్‌, రొటీన్‌ రివేంజ్‌ డ్రామా
2/5