తాత ఎన్టీఆర్ పాత్రలో తారక్
సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' పేరుతో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. 'ఎవడే సుబ్రహ్మణ్యం' ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సావిత్రి పాత్రను కీర్తి సురేశ్ పోషిస్తోన్న ఈ సినిమాలో సమంత మరో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు ఈ మూవీలో ఎన్టీఆర్ కూడా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
'మహానటి' చిత్రంలో సావిత్రి పర్సనల్ లైఫ్ కంటే కూడా నటజీవితం పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారుట. దీంతో సావిత్రితో కలసి నటించిన నటులకు కూడా ఈ సినిమాలో ఎంతో ప్రాధాన్యత ఉంది. మరీ ముఖ్యంగా అప్పటి తెలుగు అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్నార్ లను టచ్ చేయకుండా ఈ సినిమా కంప్లీట్ చేయడం కష్టం. దీంతో.. ఆ ఇద్దరి పాత్రలను వారి వారసుల చేత చేయించేందుకు ఎన్టీఆర్, నాగచైతన్యలను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం 'జై లవకుశ' సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. తాత పాత్రలో నటించేందుకు ఓకే చెపుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో అశ్వనీదత్ బ్యానర్ లో 'కంత్రి', 'శక్తి' చిత్రాల్లో నటించాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఆయన కూతురు నిర్మిస్తోన్న సినిమా కావడంతో.. ఈ సినిమాకు జూనియర్ అంగీకరించే అవకాశాలు లేకపోలేదు.