HeadLines

ఎస్.. ఎవ్రీ డిటైల్ కౌంట్స్.. ‘16‘ సినిమా రివ్యూ


తమిళంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ధృవంగల్ పతిన్నారు’. రహమాన్ ప్రధానపాత్రలో కార్తీక్ నరేన్ అనే 22 ఏళ్ల యువదర్శకుడు 28 రోజుల్లో తెరకెక్కించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 29న విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. తమిళ అనువాద చిత్రం ‘బిచ్చగాడు‘తో భారీ విజయాన్ని అందుకున్న చదలవాడ పద్మావతి.. ఈ సినిమాను కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు. ’16 -ఎవెరీ డీటెయిల్ కౌంట్స్‌’ పేరుతో ఈ సినిమా మార్చి10న తెలుగులో విడుదలైంది. 

కథగా...
రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ దీపక్ (రహమాన్). పోలీస్ ఉద్యోగంపై ఆసక్తితో వచ్చిన ఓ యువకుడికి ఆ ఉద్యోగంలోని సాధక బాధకాల గురించి చెపుతూ.. 5 ఏళ్ల క్రితం తను ఇన్వెస్టిగేట్ చేసిన ఓ కేసును గురించి వివరిస్తాడు దీపక్. శ్రుతి అనే యువతి మిస్సింగ్, క్రిష్ అనే యువకుడి హత్య, మరో హిట్ అండ్ రన్ కేసులో శవం మాయం.. ఈ మూడు కేసులను విడివిడిగా ఇన్విస్టిగేట్ చేస్తుంటాడు దీపక్. ఒకే ప్రాంతంలో జరిగిన ఈ మూడు కేసులకు.. ఒకదానితో మరొకదానికి ఉన్న సంబంధం ఏమిటి..? ఈ కేసును దీపక్ ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు. యువతి ఏమైంది..? హత్య చేసిందెవరు..? విచారణలో తేలిన నిజానిజాలేంటి..? నిందితులకు ఎలాంటి శిక్ష పడింది వంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..?

నటన.. సాంకేతిక వర్గం...
పోలీసాఫీసర్ క్యారెక్టర్ లో రహమాన్.. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకు నడిపించాడు. మిగతా నటీనటులు పాత్రల పరిధి మేరకు మెప్పించారు. ఒక క్రైమ్ చుట్టూ పలు థ్రిల్లింగ్ అంశాలు జోడించి ప్రేక్షకుడి ఊహలకు అందని మలుపులతో రక్తి కట్టించిన కార్తీక్ నరేన్.. రచయితగానే కాక దర్శకుడిగానూ మెప్పించాడు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీతో పాటు జెక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం థ్రిల్లర్ సినిమాకు తగ్గ ఇంటెన్సిటీనీ క్యారీ చేశాయి. ఈ ముగ్గురి సమిష్టి కృషి.... సినిమాలోని ప్రతీ ఫ్రేములోనూ కనిపిస్తుంది. కొన్ని సాదా సీదా సన్నివేశాలకు కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రాణం పోశాడు సంగీత దర్శకుడు జేక్స్. ఇక శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ వర్క్ తో పాటు నిర్మాణ విలువలు బాగున్నాయి. డబ్బింగ్ సినిమా అనే విషయాన్ని గుర్తు రానీయనంతగా తెలుగు నిర్మాతలు తీసుకున్న కేర్ ప్రశంసనీయం. తెలుగు సంభాషణలు పర్ఫెక్ట్ గా కుదిరాయి.

స్క్రిన్ ప్లేనే హైలెట్
గజిబిజిగా ఉన్న కేసును ఓ తెలివైన పోలీసాఫీసర్ ఒక్కో క్లూను పేర్చుకుంటూ వెళ్లి టార్గెట్ ను రీచ్ అయ్యే టైమ్ కు యాక్సిడెంట్ అవుతుంది. తిరిగి ఆ కేసులో పురోగతి ఏమిటన్నది క్లైమాక్స్ గా మెయిన్ థీమ్ తీసుకున్నాడు దర్శకుడు. సినిమాలోని ప్రతీ క్యారెక్టర్ పై ప్రేక్షకుడికి అనుమానం రేకెత్తించేలా కథను నడిపించడంతో పాటు ప్రత్యక్షంగానూ ఆయా క్యారెక్టర్స్ కు జరిగిన క్రైమ్ తో ఏదో ఒక లింక్ ను అటాచ్ చేయడంలో దర్శకుడి నేర్పరితనం కనిపిస్తుంది. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ కు చేరేవరకూ ప్రేక్షకుల ఊహకు ఏమాత్రం అందని మలుపులతో ఉత్కంఠగా కథ నడిపించడం థ్రిల్ చేస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్న సినిమా ఇది. ముఖ్యంగా స్క్రీనిప్లే విషయంలో దర్శకుడిని ప్రశంసించకుండా ఉండలేం. కేసును చేధించే హీరోనే క్లైమాక్స్ కు విలన్ ను చేయడం దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం.

హత్యల్లో చాలావరకూ.. ఆయా పరిస్థితుల్లో తీసుకున్న ఆవేశపూరిత నిర్ణయాల కారణంగానే జరుగుతాయని ఫైనల్ కంక్లూజన్ ఇవ్వడం బాగుంది. తనకు సిన్సియారిటీ నేర్పిన సీనియరే తప్పు చేస్తే అందుకు తగ్గ శిక్ష విధించిన జూనియర్ తీరుతో.. ఈ సమాజంలో పరిస్థితులకు, బాంధవ్యాలకు తలొగ్గే మనుషులు తప్ప.. హీరోలు, విలన్లు అంటూ ప్రత్యేకంగా ఉండరు అనే విషయాన్ని అంతర్లీనంగా స్పృశించాడు దర్శకుడు.


ఇదో రూబిక్స్ క్యూబ్..
ఈ సినిమా కథను రూబిక్స్ క్యూబ్ తరహా ఫజిల్ తో పోల్చవచ్చు. రూబిక్స్ క్యూబ్ లో గజిబిజిగా ఉన్న గడుల తరహాలో క్యారెక్టర్స్ ను క్రియేట్ చేసి.. అందులో కేసుకు కారణమైన క్లూస్ అన్ని ఒక వైపుకు వరుసగా పేర్చుతూ వచ్చి గేమ్ నడిపించాడు దర్శకుడు. ఇందులో ప్లేయర్ పోలీసాఫీసర్.

అంతర్లీనంగా 'దృశ్యం' థీమ్..
సినిమా మొత్తం చూశాక '16' మూవీ మెయిన్ థీమ్ ఆమధ్య వచ్చిన 'దృశ్యం' సినిమా కథలాగే కనిపిస్తుంది. అక్కడ అనుకోని అతిథిని తల్లి పైకి పంపిస్తే.. ఇక్కడ ప్రియుడు ఆ పని చేస్తాడు. అక్కడా, ఇక్కడా హత్య చేసిన తన కుటుంబ సభ్యులను కాపాడుకున్నది తండ్రే. హత్యను ముందుగానే

ఫైనల్ గా...
రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ మెచ్చే వారికి ఈ సినిమా ఏమాత్రం నచ్చదు. పైగా సరదాగా చూసి నవ్వుకునే సినిమా కూడా కాదు. క్లైమ్, ఇన్వెస్టిగేషన్ కలగలిసిన సస్పెన్స్ థ్రిల్లర్. సామాన్య ప్రేక్షకుల ఆలోచనలకు అందని అంశాలెన్నో. సో.. థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి మాత్రం విందు భోజనం లాంటి సినిమా ఇది.

4/5

నటీనటులు: రహమాన్, ప్రకాష్ విజయ రాఘవన్, అశ్విన్ కుమార్, ఢిల్లీ గణేష్ తదితరులు
సంగీతం: జేక్స్ బిజాయ్
ఛాయాగ్రహణం: సుజిత్ సారంగ్
మాటలు: శివరామప్రసాద్ గోగినేని
నిర్మాత: చదలవాడ పద్మావతి
రచన - దర్శకత్వం: కార్తీక్ నరేన్