HeadLines

సందీప్ కిషన్ 'నగరం' చిత్రం రివ్యూ


సందీప్ కిషన్, శ్రీ, రెజీనా ప్రధానపాత్రల్లో తెరకెక్కిన తమిళ చిత్రం 'మానగరం'.. 'నగరం' పేరుతో తెలుగులో అనువాదమైంది. ఈ సినిమాతో లోకేశ్ కనకరాజ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ నెల 10న విడుదల అయిన ఈ సినిమా.. రిలీజ్ కు ముందే తమిళనాట పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరి తెలుగులో ఈ సినిమా ఫలితం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం...!


కథ :
ఓ సంఘటన చుట్టూ అల్లుకున్న నాలుగు వేర్వేరు కథల సమాహారమే 'నగరం' సినిమా. రెజీనా ప్రేమ కోసం ఎంతకైనా తెగించే సందీప్ కిషన్.. రన్నింగ్ బస్ లో మరొకరిపై దాడి చేస్తాడు. తన ప్రేమను గెలుచుకునే ప్రయత్నంలో జాబ్ కోసం నగరానికి వచ్చి.. అనుకోని పరిస్థితుల్లో సర్టిఫికెట్స్ పొగొట్టుకుంటాడు శ్రీ. ఆర్థిక ఇబ్బందులతో క్యాబ్ డ్రైవర్ గా డ్యూటి ఎక్కుతాడు చార్లే. ఓ పిల్లాడిని కిడ్నాప్ చేయబోయి... మాఫియా డాన్ మధుసూదన్ కుమారుడిని కిడ్నాప్ చేసిన ఓ కిడ్నాప్ ముఠా. ఈ ముఠాలో చేరిన ఆశ, అమాయకత్వం కలిగిన మంచోడు రామ్ దాస్. వీరికి తోడు ఇగోయిస్టిక్ అంట్ కరప్టెడ్ పోలీసాఫీసర్ మరొకడు. వీరిందరిలో చాలామందికి ఒకరి పేరు మరొకరికి తెలియదు. కానీ వారికి తెలియకుండానే ఒకరితో మరొకరికి సంబంధం ఉంటుంది. 48 గంటల్లో వీరందరి నడుమ సాగే సంఘటనలే ఈ సినిమాకు కథ.

నటీనటులు...
హీరో ఇమేజ్ ను పక్కనపెట్టి మిగతా పాత్రల తరహాలో తనదీ ఓ క్యారెక్టర్ అనేలా కథలో ఇమిడిపోయాడు సందీప్ కిషన్. ఏ విషయాన్ని అంతగా లక్ష్యపెట్టని కుర్రాడిగా.. సందీప్ నటన పాత్రోచితంగా సాగింది. హీరోయిన్ రెజినా క్యారెక్టర్ కు కథలో పెద్దగా ప్రాధాన్యత లేదు. సందీప్-రెజీనా మధ్య లవ్ స్టోరీని కూడా అంతగా ఎస్టాబ్లిష్ లేదు దర్శకుడు. ఇక జాబ్ కోసం నగరానికి వచ్చే ఇబ్బందుల పాలయ్యే యువకుడిగా 'శ్రీ' నటన ఆకట్టుకుంది. చార్లే, రామ్ దాస్ కు ఈ తరహా పాత్రలు కొత్తేమి కావు. మధుసూదన్ తో పాటు కిడ్నాప్ గ్యాంగ్ టీమ్, పోలీసాఫీసర్ పాత్ర పోషించిన నటుడు మెప్పించారు.




సాంకేతికంగా....
సంగీత దర్శకుడు జావెద్ రియాజ్ నేపథ్య సంగీతం, సెల్వకుమార్ ఎస్కే సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. రిపీటెడ్ లా అనిపిస్తున్న కొన్ని సీన్స్ ను ఎడిటర్ ట్రిమ్ చేయాల్సి ఉంది. దర్శకుడు కథ, కథనాల ఎంపిక సరైనదే అయినా.. పాత్రలను ఇమడ్చటంలో కాస్త నెమ్మదించాడు. అయితే సస్పెన్స్, ట్విస్టుల విషయంలో థ్రిల్ చేశాడు.


సమీక్ష:
ఈ తరహా కథతో తెలుగులో 'వేదం', 'చందమామ కథలు' వంటి సినిమాలొచ్చాయి. ఇక ఈ సినిమా విషయానికొస్తే... ఫస్ట్ హాఫ్ లో దర్శకుడు పాత్రలను పరిచయం చేసే ప్రయత్నం చేసినా..  ప్రేక్షకుడికి మాత్రం పూర్తిగా అవి కనెక్ట్ అవలేదు. ఓ వైపు స్కూల్ పిల్లాడి కిడ్నాప్, మరోవైపు బస్ లో జరిగిన దాడి, పోలీస్ స్టేషన్ సీన్స్ ఇవన్నీ ఓ క్రైమ్ సినిమా చూస్తున్నామన్న ఫీల్ ను క్రియేట్ చేశాయి. ఇంటర్వెల్ టైమ్ కు.. వీరందరికి ఒకరికి మరొకరితో ఉన్న లింక్ ను కనెక్ట్ చేసి.. సినిమాపై ఆసక్తి పెంచాడు దర్శకుడు లోకేశ్. సెకండాఫ్ కు ఒక్కో క్యారెక్టర్ కు కథలో ఇన్వాల్ మెంట్ వచ్చింది. వీటన్నింటి కలయికతో సినిమాపై ఓ క్యూరియాసిటీ కూడా క్రియేట్ అయింది.


కథ ఉంది.. బలమైన పాత్రలు ఉన్నాయి.. కానీ క్యారెక్టర్స్ ను ఇంట్రడ్యూస్ చేయడానికి వాటన్నంటిని స్టోరీలో ఇమడ్చడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. స్లో నెరేషన్ సీన్స్ తో కాస్త విసిగించాడనే చెప్పాలి. పరుగులు తీయాల్సిన క్రైమ్ స్టోరీని ఇవి నత్తనడకన సాగేలా చేశాయి. హీరోహీరోయిన్స్, విలన్ తప్ప మిగతా వారెవరూ తెలుగు వారికి పెద్దగా తెలియకపోవడం.. రియలిస్టిక్ గా క్యారెక్టర్స్ ఎక్కువ తమిళ వాసన కొట్టేయడం.. తెలుగులో ఈ సినిమాకు మైనస్. పైగా క్రైమ్ కామెడీని ఆదరించే తెలుగులో రియలిస్టిక్ సాగే ఈ తరహా సినిమాలను ఆదరించడం అరుదు. తమిళంలో మాత్రం ఈ సినిమా మెప్పించే అవకాశాలున్నాయి. ఎంటర్ టైన్మెంట్ ఆశించకుండా క్రైమ్ థ్రిల్లర్ ను చూడాలనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది.
Rating: 2.25/5