HeadLines

కొలువుదీరిన కొత్త 'మా' కార్యవర్గం


రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన సాగిన 'మా' కార్యవర్గ పదవీకాలం ఇటీవల ముగియడంతో.. తాజాగా కొత్త కార్యవర్గం ఎంపిక జరిగింది.  అయితే లాస్ట్ టైమ్ రాజేంద్ర ప్రసాద్, జయసుధల నడుమ హోరాహోరి పోటీ నెలకొని దాదాపుగా రెండు వర్గాలు విడిపోయిందా అన్న తరహాలో రసవత్తర పోరు జరగగా.. ఈసారి మాత్రం ఏకగ్రీవంగా ఈ ఎన్నికలు జరగడం విశేషం.

గత కార్యవర్గంలో ‘మా’కు ప్రధానకార్యదర్శిగా ఉన్న శివాజీరాజాను ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా హీరో శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నటుడు నరేశ్, ఉపాధ్యక్షులుగా కమెడియన్ వేణు మాధవ్, బెనర్జీ ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా హేమ, ఏడిద శ్రీరామ్, కోశాధికారిగా పరుచూరి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు.

దాసరి కృషి ఫలితంగా ఈసారి ఎటువంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగిందని నటుడు నరేశ్ ఈ సందర్భంగా తెలియజేశారు. తనపై మా సభ్యులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానన్న నూతన అధ్యక్షుడు శివాజీరాజా... ప్రస్తుతం 30 మంది కళాకారులకు ఇస్తున్న పింఛన్ ను 25 శాతానికి పెంచబోతున్నట్టు ప్రకటించారు. అక్టోబర్‌ 4తో 'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)కు 25 సంవత్సరాలు నిండుతాయని, ఈ సందర్భంగా సిల్వర్‌ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు.