ఆమీర్ ఆశపడ్డ క్యారెక్టర్ లో మహేష్
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధానపాత్రలో రూ. 1000 కోట్ల బడ్జెట్ లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. మహాభారతంలోని భీముడి పాత్ర చుట్టూ ఈ కథ నడుస్తుంది. భీముడి పాత్రను మోహన్ లాల్ పోషిస్తుండగా.. ఇతర పాత్రల కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇందులోని ఓ పాత్ర కోసం మహేశ్ బాబు పేరు తెరపైకి వచ్చింది.
ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ రచించిన ‘రండమోజమ్’ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రముఖ వ్యాపారవేత్త, ఫిలాంత్రఫిస్ట్ అయిన డా. బి. ఆర్.శెట్టి ఈ భారీ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నారు. ఇండియాలోని అన్ని ఇండస్ట్రీల నటీనటులను ఈ సినిమా కోసం తీసుకోబోతున్నారు. ఇందులో భాగంగా కృష్ణుడి పాత్ర కోసం మహేష్ బాబును సంప్రదించబోతున్నారని తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ ను 2020 కల్లా కంప్లీట్ చేయాలన్నది డైరెక్టర్ శ్రీకుమార్ టార్గెట్.
కొన్నాళ్లుగా బాలీవుడ్ లో 'మహాభారతం' తెరకెక్కే విషయంపై భారీ చర్చ జరుగుతోంది. రాజమౌళి దర్శకత్వంలో ఈసినిమా ఉండబోతోందనే ప్రచారం జరుగుతోంది. మహాభారతంలో కృష్ణుడి పాత్ర పోషించేందుకు తాను సిద్ధమని ఇప్పటికే ఆమీర్ ఖాన్ ప్రకటించాడు. సో.. ఆమీర్ ఆశపడ్డ క్యారెక్టర్ ఇప్పుడు మహేశ్ ను వరించబోతోంది. మరి.. మహేశ్ ఏమంటాడో..!