HeadLines

లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ అరెస్ట్


మలయాళ నటి భావనను లైంగికంగా వేధించిన కేసులో ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విషయమై కొన్ని రోజుల క్రితం దిలీప్ ను పోలీసులు 13 గంటల పాటు విచారించారు. భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో దిలీప్ ప్రమేయం ఉన్నట్టు తాజాగా ఆధారాలు లభించడంతో కేరళ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు.


ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి తన కారులో వెళ్తున్న భావనను కొందరు వ్యక్తులు అడ్డగించి ఆమె వాహనంలోకి ఎక్కారు. సుమారుగా రెండు గంటలపాటు లైంగికంగా వేధించడమే కాకుండా, అశ్లీల ఫొటోలూ తీశారు. ఈ విషయంపై వెంటనే భావన పోలీసులకు పిర్యాదు చేశారు. ప్రధాన నిందితుడైన పల్సర్‌ సుని అనే వ్యక్తితో పాటు భావన కారు డ్రైవర్‌ మార్టిన్ తో సహా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

ఈ కేసు వెనుక పలువురు సినీ ప్రముఖుల హస్తముందని.. ముఖ్యంగా దిలీప్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని గతంలోనే పలు వార్తలు వచ్చాయి. ఇందుకు తగ్గట్టుగానే నిందుతులను విచారించిన పోలీసులు.. వారు ఇచ్చిన సమాచారంతో ఆధారాలు సేకరించి ఈరోజు దిలీప్ ను అరెస్ట్ చేశారు.