HeadLines

'సమ సమాజ్' పేరుతో ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ



ఎనిమిదేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జూనియర్.. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. పైగా ఈసారి సొంతంగా పార్టీ పెట్టాడు. ఆ పార్టీ పేరు 'సమ సమాజ్' పార్టీ కాగా.. గుర్తు పాల క్యాన్. కాకపోతే.. ఇదంతా సినిమా షూటింగ్ కోసమే. అవునుమరి... 'జై లవకుశ' సినిమాలో పొలిటీషియన్ గా కనిపించబోతున్నాడు ఎన్టీఆర్.

బాబి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'జై లవకుశ' సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫూణెలో జరుగుతోంది. ఈ షూటింగ్‌కు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ కొన్ని ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. వాటిలో 'సమ సమాజ్ పార్టీ' పేరిట ఎన్టీఆర్ ఫొటోతో కూడిన జెండాలు, కటౌట్స్.. బ్యానర్స్ కట్టిన జీపులు దర్శనమిస్తున్నాయి. వీటిని బట్టి ఎన్నికల ప్రచార నేపథ్యంలో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.



బ్యానర్స్ లో అక్షరాలు హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ఉండడంతో ఇది ఉత్తర భారతదేశం నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. అదీకాక.. వెహికిల్స్ పై ఉన్న రిజిస్ట్రేషన్ నంబర్ ఒకప్పటి ఒరిస్సా (ఇప్పుడు ఒడిస్సా) నేపథ్యాన్ని సూచిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్.. తాజా వర్కింగ్ స్టిల్స్ ను బట్టి... ఎన్టీఆర్ 'జై' క్యారెక్టర్‌లో నెగటివ్ పొలిటీషియన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. పొలిటికల్ టచ్ కూడా ఉండడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సెప్టెంబర్-21న ఈ సినిమా విడుదల కాబోతోంది.