స్పీల్ బర్గ్ సినిమాకు జేమ్స్ కేమరూన్ హెల్ప్
హాలీవుడ్ అగ్ర దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ నుంచి ఓ సినిమా వస్తుందంటే... ప్రపంచమంతా ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. 'జాస్', 'ఇండియానా జోన్స్', 'జురాసిక్ పార్క్' వంటి అద్భుత చిత్రాలు రూపొందించిన స్పీల్ బర్గ్ నుంచి రాబోతున్న అప్ కమింగ్ మూవీ 'రెడీ ప్లేయర్ వన్'. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలై సూపర్బ్ టాక్ తెచ్చుకుంది.
వీడియోగేమ్స్ నేపథ్యంలో 'రెడీ ప్లేయర్ వన్' సినిమా రూపొందిస్తున్నాడు స్పీల్ బర్గ్. ఇందుకోసం దాదాపుగా 80 శాతం వరకూ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదే టెక్నాలజీతో ఇప్పటికే 'అవతార్' వంటి అద్భుత చిత్రం చేశాడు జేమ్స్ కేమరూన్. దీంతో.. తన కంటే జూనియర్ అయినప్పటికీ.. మోషన్ టెక్నాలజీలో కేమరూన్ ఎక్స్ పర్ట్ కావడంతో... 'రెడీ ప్లేయర్ వన్' కోసం అతని హెల్ప్ ను కోరాడట స్పీల్ బర్గ్. ఈ సినిమాకి స్క్రీన్ రైటర్ గా పనిచేసిన జాక్ పెన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇక ట్రైలర్ తోనే ఆశ్చర్యపరుస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి-30న విడుదల కాబోతోంది.