HeadLines

కోర్టు కేసులో కాజల్ కు చేదు అనుభవం

హీరోయిన్స్ లో చాలావరకూ ప్రమోషన్ విషయంలో డుమ్మా కొడతారేమో కానీ.. రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం పక్కాగా వ్యవహరిస్తారు. అయితే ఇప్పుడు సినిమా విషయంలో కాక... ఓ యాడ్ మేటర్‌లో  కోర్టుకెక్కింది కాజల్ అగర్వాల్. కాకపోతే కాజల్ కు కోర్టులో చేదు అనుభవమే ఎదురైంది. అవతలి పార్టీ కోర్టు ఖర్చులను కూడా కాజలే భరించాలంటూ కోర్టు తీర్పునిచ్చింది.

విషయంలోకి వెళితే... 2008లో 'వివిడి' బ్రాండ్‌కు చెందిన కొబ్బరి నూనెను ప్రమోట్ చేస్తూ... కమర్షియల్ యాడ్‌లో నటించడంతో పాటు ఓ ఫొటోషూట్ కూడా చేసింది కాజల్. అయితే.. ఆ కంపెనీకి కాజల్ కు మధ్య కాంట్రాక్ట్ గడువు ముగిసిందట. కానీ ఇంకా వారు ఆ ప్రకటనను వాడుకోవడం భావ్యం కాదని.. ఇందుకుగానూ రూ.2.5 కోట్లవరకూ తనకు పరిహారం చెల్లించాలని మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది కాజల్.

ఎంతో డబ్బు వెచ్చించి యాడ్ చేయించుకున్న సంస్థ.. కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ.. కాపీ రైట్స్ చట్టం ప్రకారం 60 ఏళ్ల పాటు దాన్ని వాడుకునే హక్కు ఉందని.. కంపెనీ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. రెండు వైపులా వాదనలు విన్న కోర్టు.. కాజల్ పిటీషన్ లో బలం లేదని కేసు కొట్టివేయడంతో పాటు.. విచారణ నిమిత్తం సదరు కంపెనీ భరించిన ఖర్చులను కూడా కాజలే చెల్లించాలని ఆదేశించిందట. మరో పెద్ద కంపెనీకి చెందిన కోకోనట్ ఆయిల్ యాడ్ చేయడానికి.. ఈ పాత యాడ్ అవరోదంగా మారిందట. అందుకే పాత నూనె వదిలించుకునే ప్రయత్నం కాజల్ చేస్తే.. అదేమో జిడ్డులా పట్టేసింది.