సాయి ధరమ్‌తేజ్, కరుణాకరన్ చిత్రం ప్రారంభం
ఓ రెండు ప్లాపులు వరుసగా పలకరించాయంటే.. తర్వాత ఆ హీరో వైపు చూడటానికి ఏ నిర్మాత కూడా సాహసించడు. కానీ.. ఇటీవల వరుస ప్లాపులు అందుకున్న సాయిధరమ్ తేజ్ మాత్రం వరుస కొత్త సినిమాలతో బిజీ అవుతున్నాడు. వినాయక్ తో సాయిధరమ్ తేజ్ సినిమా ప్రారంభమై వారం తిరక్కముందే మరో కొత్త చిత్రం ఆరంభించేశాడు సాయిధరమ్ తేజ్.
సాయిధరమ్ తేజ్ హీరోగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న చిత్రం ఈరోజు ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు. హీరో సాయిధరమ్‌తేజ్, దర్శకుడు ఎ.కరుణాకరన్, సినిమాటోగ్రాఫర్ ఐ.ఆండ్రూ, మాటల రచయిత డార్లింగ్ స్వామి, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్, ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్, నిర్మాత కె.ఎస్.రామారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఓ వైపు ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతుండగా.. మరోవైపు డైలాగ్ వర్క్ జరుగుతోందట. విజయదశమి రోజు నుంచి షూటింగ్ ప్రారంభించబోతున్నారు. సాయిధరమ్ కు జంటగా మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా.. గోపీ సుందర్ సంగీతం సమకూర్చనున్నాడు. ఇక గతంలో కె.ఎస్.రామారావు నిర్మాణంలో 'వాసు' సినిమాను తెరకెక్కించాడు కరుణకారన్. ఇక పవన్ తో 'తొలిప్రేమ', 'బాలు' సినిమాలు చేసిన కరుణాకరన్ ఇప్పుడు పవర్ స్టార్ మేనల్లుడితో ఈ సినిమా చేస్తుండటం విశేషం.