HeadLines

'జై లవకుశ'లో తారక్ తర్వాత హైలెట్ అయ్యే క్యారెక్టర్

'జై లవకుశ' సినిమాలో ఎన్టీఆర్ పోషిస్తోన్న మూడు పాత్రల్లో ఏ క్యారెక్టర్ హైలెట్ అవుతుందంటే.. 'జై' అని.. సినిమా చూడకుండానే చెప్పేయొచ్చు. టీజర్స్, ట్రైలర్ తో ఆ క్యారెక్టర్ అంతలా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. అయితే.. హీరోయిన్స్ గా నటిస్తున్న రాశీఖన్నా, నివేదా థామస్ లో ఎవరు ఎక్కువ మార్కులు కొట్టేస్తారంటే మాత్రం చెప్పడం కాస్త కష్టమే. కానీ.. పెర్ఫామెన్స్ పరంగా నివేదా థామస్ కు మరో మంచి రోల్ లభించిందనే తెలుస్తోంది.

హీరోయిన్ గా తెలుగులో నటించింది రెండు సినిమాలే అయినా.. రెండింటిలోనూ పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్ లోనే నటించింది నివేదా. స్టార్ హీరోల సినిమాల్లో కథానాయిక పాత్రలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉండకపోగా.. కేవలం పాటలకు పరిమితమయ్యే గ్లామర్ రోల్స్ చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగానే నివేద వంటి కొందరు భామలు.. కమర్షియల్ మూవీస్ పై అంతగా కాన్ సంట్రేషన్ చేయరు. కానీ.. 'జై లవకుశ'లో మాత్రం నివేదాకు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టరే లభించిందట. ఇందుకు కారణం జై క్యారెక్టర్ అని చెప్పాలి.

రావణుడిగా రాక్షసత్వం నిండిన 'జై' పాత్రకు జోడిగా నివేద నటించింది. అంతటి రాక్షసుడు కూడా నివేద విషయంలో సాఫ్ట్ గా ప్రవర్తిస్తాడట. కథలో మలుపుకు కారణమైన కీలకమైన ఈ పాత్రతో నివేద నటిగా మరింత మెప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. ఎన్టీఆర్ వంటి టాలెంటెడ్ యాక్టర్ ఎదుట.. నివేద  ఏ స్థాయిలో మెప్పించిందో తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. ఈనెల 21న ఈ మూవీ విడుదల అవుతోన్న విషయం తెలిసిందే.