నిన్నటిదాకా నీతులు.. ఇప్పుడు బూతు చిత్రం పగ్గాలు
కొద్దిరోజుల ముందువరకూ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కు కంటిమీద నిద్ర లేకుండా చేశాడు మాజీ సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లజ్ నిహ్లానీ. ఇప్పుడు ఆ స్థానంలో మరికరిని నియమించాక.. బాలీవుడ్ సినీజనాలు ఊపిరి పీల్చుకున్నారు. సెన్సార్ బోర్డు పగ్గాలు తన చేతిలో ఉన్నంతకాలం.. ద్వందార్థాలు, బూతు సీన్లు అంటూ చాలా సినిమాలకు పదుల సంఖ్యలో కత్తెరలు వేశాడు నిహ్లానీ.
సీన్ కట్ చేస్తే.. తానే ఇప్పుడు ఓ అడల్ట్ కంటెంట్ సినిమాకు ప్రజంటర్ గా వ్యవహరిస్తూ తన పేరు వేయించుకుంటున్నాడు. ఆ సినిమా మరేదో కాదు.. లక్ష్మీరాయ్ నటిస్తున్న హిందీ చిత్రం 'జూలీ-2'. గత ఏడాది ఆగస్టులోనే ఈ సినిమాను విడుదల చేస్తానన్న దర్శకుడు దీపక్ శివదాసాని.. ఈ ఏడాది అక్టోబర్-6న విడుదల చేస్తున్నాడు. ఇటీవల తన భార్యతో కలసి సినిమా చూసిన పహ్లజ్ నిహ్లానీకి.. సినిమాలోని కంటెంట్ తెగ నచ్చేసిందట. అందుకే ఈ సినిమాను డిస్ర్టిబ్యూట్ చేస్తూ.. సమర్పకుడిగా తన పేరు వేసుకున్నాడు.
పహ్లజ్ నిహ్లానీకి నచ్చిన కంటెంట్ ఏమిటో కానీ.. సినిమాలో చాలానే బూతు కంటెంట్ ఉందన్న విషయం ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. పైగా పదవిలో ఉండగా ఎంతో మంది నిర్మాతలకు నీతులు చెప్పిన పహ్లజ్.. ఇప్పుడిలా ఓ బూతు సినిమాను విడుదల చేయనుండడపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. నిహ్లానీ మాత్రం అప్పుడంటే సెన్సార్ ఆఫీసర్ ను.. ఇప్పుడు కేవలం ఓ ప్రొడ్యూసర్ కం డిస్ట్రిబ్యూటర్ ను కనుక తన పని తాను చేసుకుంటానంటూ కొత్త పాట పాడుతున్నాడు.