HeadLines

వర్మ స్కెచ్: ఎన్టీఆర్ పాత్రలో ప్రకాశ్ రాజ్


ఎన్టీఆర్ జీవితంలోని రాజకీయాలకు సంబంధించిన కీలక అంశాల ఆధారంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో రామ్ గోపాల్ వర్మ ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశాడు వర్మ. వైఎస్ఆర్ సీపీకి చెందిన రాకేశ్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. 

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి రంగప్రవేశం తర్వాతి పరిణామాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్టు వర్మ ఇప్పటికే ప్రకటించాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ మొదలెట్టాడట వర్మ. ఇందులో భాగంగా ఎన్టీఆర్ పాత్రకు ప్రకాశ్ రాజ్ ను సంప్రదించబోతున్నట్టు తెలుస్తోంది. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ అయితేనే.. ఎన్టీఆర్ పాత్రకు న్యాయం చేయగలడని భావిస్తున్నాడట వర్మ. గతంలో 'ఎటాక్' వంటి వర్మ చిత్రాల్లో ప్రకాశ్ రాజ్ నటించిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ పాత్రలో మెప్పించాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా ఎవరూ సాహసించని పాత్ర అది. గతంలో కోట శ్రీనివాసరావు వంటి వారు ఈ పాత్రను పోషించి దెబ్బలు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. పైగా ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎలాగూ వర్మ వివాదాస్పద అంశాలనే టచ్ చేస్తాడనే అనుమానాలు ఉన్నాయి. మరి.. ఇలాంటి సిట్యువేషన్ లో ఎన్టీఆర్ పాత్రను పోషించే సాహసం ప్రకాశ్ రాజ్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.