HeadLines

కమెడియన్ గుండు హనుమంతరావు అస్తమయం

 

ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు (61) కన్నుమూశారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న హనుమంతరావు.. ఇటీవల ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. కోలుకుని ఇటీవలే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లడంతో ఆరోగ్య పరిస్థితి మెరుగు పడింది అనుకునేంతలో ఈ రోజు తెల్లవారుఝామున అస్వస్థతకు గురయ్యారు. దగ్గరలోనే హాస్పిటల్ కు వెళ్లేటప్పటికే ఆయన తుదిశ్వాస వదిలారు.

అనారోగ్యంతో పాటు ఆర్థికంగానూ ఆయన ఇబ్బందిపడుతుండడంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిది నుంచి రూ.5 లక్షలు మంజూరు చేసింది. చిరంజీవి కూడా ఆయనకు రూ.2 లక్షల ఆర్థికసాయాన్ని అందజేశారు. గుండు హనుమంత రావుకు భార్య, ఇద్దరు పిల్లలు కాగా.. ఇప్పటికే భార్య, కూతురు చనిపోయారు. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లాల్సిన కొడుకు.. తండ్రి ఆరోగ్యపరిస్థితుల దృష్ట్యా విరమించుకున్నాడు. ఆనారోగ్య కారణాలతోనే కొన్నాళ్లుగా గుండు సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

అక్టోబర్-10, 1956లో విజయవాడలో జన్మించారు గుండు హనుమంతరావు. 18 ఏళ్ల వయసులో 'రావణబ్రహ్మ' నాటకంలో నటించిన ఆయన.. 'అహనా పెళ్లంట' చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. సినిమాల్లో నటించకముందు మిఠాయి వ్యాపారం చేసేవారు గుండు.  400లకు పైగా చిత్రాల్లో నటించిన హనుమంతరావుకు.. జంధ్యాల, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఎక్కువగా గుర్తింపును ఇచ్చాయి.  కొబ్బరిబొండాం, మాయలోడు, శుభలగ్నం, యమలీల చిత్రాలు హాస్యనటుడిగా ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. వీటితో పాటు 'అమృతం' అనే టీవీ సీరియల్ ఆయనకు ఎంతో ఖ్యాతి తీసుకొచ్చింది.