'తొలిప్రేమ' రివ్యూ : ఎ ఫీల్ గుడ్ లవ్ జర్నీ
ప్రతి ఒక్కరి జీవితంలోనూ 'తొలిప్రేమ'కు ఓ ప్రాధాన్యత ఉంటుంది. కొందరు సక్సెస్ అవ్వొచ్చు.. మరికొందరు ఫెయిల్ అవ్వొచ్చు. పైకి చెప్పుకోకున్నా అప్పుడప్పుడూ ఆ జ్ఞాపకాన్ని తమలో తాము గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఇక ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన 'తొలిప్రేమ' సినిమా ఎందరికో తమ ఫస్ట్ లవ్ ను గుర్తు చేసి మంచి విజయాన్ని అందుకుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇదే టైటిల్ తో ఓ సినిమా వచ్చింది. టైటిల్ కు తగ్గ భావోద్వేగాలు ఈ సినిమాలో ఉన్నాయా.. ఈ ప్రేమకథ మెప్పించిందా లేక నొప్పించిందో చూద్దాం..
కథ:
ఓ రైలు ప్రయాణంలో వర్ష (రాశీఖన్నా)ను చూసిన ఆదిత్య (వరుణ్ తేజ్) తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. ఇద్దరి మధ్య స్నేహం కుదురుతుంది. అయితే అనుకోకుండా ఆదిత్యకు దూరమైన వర్ష.. మూడు నెలల తర్వాత కాలేజీలో ప్రత్యక్షమవడంతో తిరిగి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. కానీ ఓ సంఘటన వల్ల ఈ ఇద్దరి నడుమ మనస్పర్థలు వచ్చి విడిపోతారు. ఆరేళ్ల తర్వాత తిరిగి లండన్ లో ఆదిత్యకు కనిపిస్తుంది వర్ష. అసలు ఈ ఇద్దరూ ఎందుకు విడిపోయారు..? తిరిగి కలసిన వీరు ఎలా ఒక్కటయ్యారు అనేది మిగతా కథ.
ఎవరెలా..
'ఫిదా' తర్వాత మరోసారి లవర్ బాయ్ పాత్రలో ఆకట్టుకున్నాడు వరుణ్ తేజ్. రాశీఖన్నాకు అయితే కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అని చెప్పొచ్చు. ఇతర పాత్రల్లో సుహాసిని, నరేశ్, ప్రియదర్శి, విద్యుల్లేఖ, హైపర్ ఆది పాత్రల పరిధిమేరకు నటించారు.
ఈ సినిమాకు సంగీతం అందించింది తమన్ అంటే వెంటనే నమ్మేయడం కాస్త కష్టమే. మాస్ కు నచ్చేలా ఉండాలంటూ కొన్నాళ్లుగా మూస ధోరణిలో వెళుతోన్న తమన్.. ఈ సున్నితమైన ప్రేమకథకు తగ్గ సునిశిత సంగీతాన్ని ఇచ్చాడు. పాటలతో పాటు నేపథ్య సంగీతంలోనూ మెప్పించాడు. సినిమాటోగ్రఫీ కూడా కథకు తగ్గరీతిలో ఆకట్టుకునేలా ఉంది. ఇక దర్శకుడు వెంకీ రాసుకున్న డైలాగ్స్ పంచ్ ల కోసం ప్రాకులాడకుండా.. సంభాషణలతో సన్నివేశాలను నిలబెట్టేలా ఉన్నాయి.
సమీక్ష
నిజానికి ఈ కథలో కొత్తదనం అంటూ ఏమీ లేదు. ఏం జరగబోతోంది అనేది కూడా ప్రేక్షకుడు ముందే ఊహించేయచ్చు. ఎటొచ్చి.. ఓ ప్రేమకథను మనసుకు హత్తుకునేలా దర్శకుడు వెంకీ అట్లూరి మలచిన తీరు.. రచయితగా అతని ప్రతిభ మాత్రమే ఈ సినిమానే నిలబెట్టాయి. ఇలాంటి కథను తన తొలి సినిమాకు ఎంచుకోవడం ఓ రకంగా సాహసమే. తనదైన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో సునాయాసనంగా ఈ ఫీట్ సాధించాడు వెంకీ. ఫస్ట్ ఆఫ్ లో హీరోహీరోయిన్ల ప్రేమలో ఎంటర్ టైన్మెంట్ కు స్కోప్ ఇచ్చిన దర్శకుడు.. సెకండాఫ్ లో ఎమోషన్ కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు.ఫస్ట్ హాఫ్ లో విద్యుల్లేఖా రామన్.. సెకండాఫ్ లో హైపర్ ఆది కామెడీ పండించారు.
ఒక మనిషి జీవితంలో ప్రేమకు సంబంధించిన వివిధ దశలను చూపించడమే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. రీసెంట్ గా వచ్చిన సుమంత్ 'మళ్లీరావా' సినిమాలోనూ ఇదే తరహా కథ, స్క్రీన్ ప్లే మనకు కనిపిస్తుంది. అలాగని ఈ రెండు సినిమాల మధ్య పోలికలు ఉన్నాయని కాదు. ఇక ఒకప్పుడు పవన్ కు సూపర్ హిట్ ఇచ్చిన 'తొలిప్రేమ' లాంటి టైటిల్ ను టచ్ చేయడానికి ఎంతో ధైర్యం కావాలి. ఆ సినిమాకు దీనికి పోలిక లేకపోయినప్పటికీ.. టైటిల్ జస్టిఫికేషన్ చేసి మరోసారి హిట్ అనిపించుకుంది.
ఫైనల్ గా..
యూత్ తో ఫాటు ఫ్యామిలీ ఆడియన్స్ హాయిగా చూడదగ్గ చిత్రం.
రేటింగ్.. 3.5/5
********************
నటీనటులు : వరుణ్ తేజ్, రాశీ ఖన్నా, సుహాసిని, నరేశ్, ప్రియదర్శి, హైపర్ ఆది
రచన, దర్శకత్వం : వెంకి అట్లూరి
నిర్మాత : బి వి ఎస్ ఎన్ ప్రసాద్
సంగీతం : ఎస్.ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ : జార్జి సి. విలియమ్స్
విడుదల తేది : ఫిబ్రవరి-10, 2018