విజయ్ ఆంటోని 'కాశి' రివ్యూ
‘బిచ్చగాడు’ సినిమా మెప్పించడంతో విజయ్ ఆంటోని నుంచి సినిమా వస్తోందంటే.. తమిళ ఆడియన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ లోనూ ఏదో కొత్తదనం చూపిస్తాడు అనే అంచనాలున్నాయి. కానీ ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా ఆ ఎక్స్ పెక్టేషన్స్ కు రీచ్ అవలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా కొత్త కాన్సెప్ట్ లు ప్రయత్నిస్తోన్న విజయ్ ఆంటోని.. ఈసారి కృతిగ (తమిళ హీరో ఉదయనిధి భార్య) దర్శకత్వంలో 'కాశి' అనే సినిమాతో జనం ముందుకొచ్చాడు. విడుదలకు ముందే ఈ సినిమాలోని తొలి 7 నిముషాల సన్నివేశాలను యూట్యూబ్ లో విడుదల చేయడం విశేషం. మరి.. శుక్రవారం (18-05-2018) తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన 'కాశి'తో ఈ 'బిచ్చగాడు' హీరో మెప్పించాడో.. నొప్పించాడో ఇప్పుడు చూద్దాం..
కథ:
అమెరికాలో ప్రఖ్యాతి గాంచిన డాక్టర్ అయిన భరత్ (విజయ్ ఆంటోని)ను.. ఓ కల వెంటాడుతుంటుంది. ఓ పాము తనను కాటేయడానికి రావడం, ఓ ఎద్దు తనను తరుముకు రావడం ఈ కల సారాంశం. ఇదే సమయంలో తన తల్లితండ్రులకు తాను సొంత కొడుకును కాదనే విషయం తెలుస్తుంది. ఈ క్రమంలో తన కలకు, సొంత తల్లితండ్రులకు ఏదో లింక్ ఉంటుందని భావించి.. వారిని వెతుక్కుంటూ ఇండియా వస్తాడు భరత్. తల్లి గురించిన విషయాలైతే సులభంగానే తెలుసుకున్న భరత్.. తండ్రి గురించిన విషయాలు తెలుసుకునేందుకు కంచర్లపాలెం అనే గ్రామానికి వెళ్తాడు. తన తండ్రి ఎవరో భరత్ ఎలా తెలుసుకున్నాడు.. ఈ క్రమంలో ఎదురైన అనుభవాలు ఏమిటన్నదే ఈ సినిమా కథ.
ఎవరెలా..
విజయ్ ఆంటోని ఎక్స్ ప్రేషన్సే కాదు.. ఆయన అందించిన మ్యూజిక్ కూడా గత చిత్రాలను గుర్తు చేసేలా ఉంది. అయితే నేపథ్య సంగీతం మాత్రం సన్నివేశాలకు తగ్గట్టుగా మెప్పించింది. రిచర్డ్ ఎమ్.నాథన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎడిటింగ్ విషయానికొస్తే... సాగతీతగా సాగే సన్నవేశాల్లో కత్తెరకు పనిచెప్పాల్సిన సీన్స్ ఎన్నో ఉన్నాయి. కథానాయికలు సునైన, అమృత అయ్యార్ అభినయంతో ఆకట్టుకోగా.. అంజలికి అంతగా ప్రాధాన్యత లేని పాత్రే దక్కింది. నాజర్, మధుసూదన్, జయ ప్రకాశ్, యోగిబాబు పాత్రల పరిధి మేరకు మెప్పించారు. దర్శకురాలు కృతిగ ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ... ఇతర పాత్రల్లోకి హీరోను ప్రవేశపెట్టి చేసిన ప్రయోగం నిరాశపరచింది.
సమీక్ష:
'బిచ్చగాడు' సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది తల్లి సెంటిమెంట్. సరిగ్గా దీన్నే 'కాశి' కథలోనూ ఇదే అంశాన్ని ఎంచుకున్నారు. కలలా వెంటాడుతోన్న తల్లి జ్ఞాపకాలను వెతుక్కుంటూ హీరో ప్రయాణం మొదలు పెట్టడం సినిమాకు ఇంట్రస్టింగ్ ఎలిమెంట్. తొలి పదినిముషాలు ఆసక్తి రేపేలా కథ నడిపించిన దర్శకురాలు... ఆ తరువాత కూడా దానిని కొనసాగించి ఉంటే 'కాశి' కూడా మరో 'బిచ్చగాడు' అయ్యుండేదేమో. కానీ.. అసలు కథకు సంబందం లేకుండా వచ్చే ఉపకథలు సినిమాను సైడ్ ట్రాక్ పట్టించాయి. ఆడియన్స్ కు సినిమా బోర్ కొట్టించేలా చేశాయి.
తల్లిదండ్రులను వెతుక్కుంటూ వచ్చిన కొడుకు.. గతంలో జరిగిన మూడు సంఘటనలు తెలుసుకోవడం.. ఆ మూడు ఉప కథల్లో తననే హీరోగా చూపించడం వైవిధ్యంగా అనిపించే అంశమే. కానీ.. హీరో తల్లిదండ్రుల గురించి చెప్పాల్సిన కథల్లో.. ఏమాత్రం సంబంధం లేని ఇద్దరు వ్యక్తుల కథను జొప్పించడం ఈ సినిమా విషయంలో ఎదురైన అసలు ఇబ్బంది. పైగా ఆ మూడు సాదాసీదాగా సాగతీత దోరణిలో సాగే ప్రేమకథలు కావడంతో.. సినిమా ఎటు పోతోందో అర్థంకాని చిందరవందర పరిస్థితి నెలకొంది. ఇక కథే హీరోకు సంబంధం లేనప్పుడు వారిమధ్య వచ్చే పాటలు మరింత ఇబ్బందిపెట్టడంలో ఆశ్చర్యం ఏముంటుంది. దీంతో సినిమా ప్రారంభంలో ప్రేక్షకుల్లో కనిపించిన ఆసక్తి క్రమంగా సన్నగిల్లింది. ఇక విజయ్ ఆంటోని-అంజలి నడుమ లవ్ ట్రాక్ వర్కవుట్ అవలేదు. కమెడియన్ యోగిబాబు పాత్ర ద్వారా వేసిన కామెడీ పంచ్ లు కాస్త ఉపశమనం.
'బిచ్చగాడు' తరహా సెంటిమెంట్ స్టోరీతో మరో విజయాన్ని అందుకోవాలనుకున్న విజయ్ ఆంటోని ప్రయత్నం 'కాశి'తో ఫలించలేదనే చెప్పాలి. ప్రారంభం, ముగింపు బాగున్నప్పటికీ.. అనవసరమైన కథనంతో బోర్ కొట్టించింది 'కాశి'.
రేటింగ్: 2/5